ఆ నలుగురిలో… మొదటివాడు!! – జాన్ సన్ చోరగుడి

Share this Page

ఆ నలుగురిలో…
మొదటివాడు!!

       - జాన్ సన్ చోరగుడి

కళాశాల స్థాయిలో ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రను పాఠ్యాశంగా బోధించడానికి గాను 2014 ను ఒక ‘టైం ఫ్రేం’ గా మన యూనివర్సిటీలు ప్రకటించాయి. అయితే ఈ పాఠ్య పుస్తకాలు ఇంకా తయారు కావాల్సివుంది. గతంలో ఈ పుస్తకాల తయారీకి – 1956 ఒక కాల హద్దుగా ఉండేది. రెండు కాలాలు అంటే, ఇక్కడ మనకు విషయం విదితమే – మొదటిది (1956) మెడ్రాస్ నుంచి ఆంధ్రులు విడిపోవడం, రెండవది (2014) ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణా విడిపోవడం. అయితే తెలుగు వారి చరిత్రకు – కాలహద్దుల్లో అయినా, భూగోళిక హద్దుల్లో అయినా; తూర్పున వొంచిన విల్లులా వున్నది సముద్ర తీరం. ఆ విల్లును పట్టి పిడికిలి బిగించి వింటిని సారించే మధ్య స్థానంలో వున్నది – కృష్ణా మండలం.

ఏమిటి దీని ప్రత్యేకత? సమయమూ సందర్భమూ ఏదయినా – ‘హిస్టరీ తన జాగ్రఫీని వెతుక్కుంటుంది’ అనేది పాత నానుడే. ఎప్పుడయినా అదే నిరంతర కాల పరీక్షకు ఎదురు నిలుస్తున్నసత్యం. అదే ఇక్కడ కూడా మళ్ళీ ముందుకు వస్తున్నది. ఎక్కడో దేశానికి వాయువ్యాన గుజరాత్ సబర్మతి ఆశ్రమంలో వుంటూ అక్కణ్ణించే తన జాతీయ ఉద్యమాన్ని రూపొందించిన గాంధీజీ 1921 ఏప్రెల్ నాటికి దేశానికి పూర్తిగా ఆగ్నేయ మూలన ఉన్న బందరు రావడం అప్పట్లో ఎలా సాధ్యమయింది?

ఆయన మన రాష్ట్రానికి రావడానికి ముందు, ఇక్కడ జాతీయ భావనలతో ఎంత క్రియాశీలత వుండి, ఇక్కడ ఎంత సోషియో-పొలిటికల్ ఇంజనీరింగ్ జరిగితే, ఆయన సందర్శనకు అనువయిన పరిస్థితులు ఇక్కడ నెలకొని వుండి వుంటాయి? ఎంత సాంద్రమైన జాతీయ భావాల పరిపక్వత ఇక్కడ నెలకొని వుండివుంటే; ఏదో ఒకరోజు ఈ దేశానికీ ఒక జాతీయ పతాక అవసరమవుతుంది అని అనుకోవడం గాని, దానికి ఒక నమూనా తాయారు చేద్దాం – అనే సంకల్పం ఇక్కడ పింగళి వెంకయ్య అనే ఓ పేదింటి యువకునికి కలుగుతుంది?

ఇవన్నీ జరిగి ఇప్పటికి వందేళ్ళు కావచ్చు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయి ఏళ్ళు ఎటూ అయింది. గడచిన ఈ కాలంలో ఎవరి అనుభవాలు వారికి వున్నాయి, ఎవరి అభిప్రాయాలూ వారికి వున్నాయి. రాష్ట్రంగా ఏర్పడిన అరవయ్యేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ రెండు అయింది. అయితే అది రెండు అయిన ఈ మూడున్నర ఏళ్లలో ఒక్క జాతీయ స్థాయి ఆంగ్ల కాలమిస్టు తన ‘కాలం’ లో ఈ రాష్ట్రం గురించి ఇంత వరకు రాయలేదు. అంటే ఈ ప్రభుత్వాన్ని పొగడ్డమో తెగడ్డమో అని కాదు.

ఇది ఒక ప్రాంతము, ఇక్కడ ఒక భాషా సమాజము వుంది అది ఇప్పుడు రెండు అయింది; అది ఈ దేశంలో ఒక నైసర్గిక భాగం, దీనికి కొన్ని బలాలు –బలహీనతలు వుంటాయి అని, అయితే అస్సలు ఇప్పుడు అక్కడ ఏమి జరుగుతుంది, రాష్ట్ర విభజన తర్వాత అక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు? అస్సలు ఇప్పుడు వారు ఏమి కోరుకుంటున్నారు? ఈ ప్రాంత భవిష్యత్తు ఎలా వుండబోతున్నది, అనేవి నామమాత్రంగా కూడా ఎవ్వరూ ఎక్కడా జాతీయ మీడియాలో ఇప్పటివరకు ప్రస్తావించింది లేదు.

అస్సలు మొదలు 80’ దశకం నాటికే “మన తెలుగు వారిని ఉత్తర భారతం – ‘మదరాసీలు’ అంటున్నారు” అనేది అప్పట్లో ఎన్టీఆర్ పిర్యాదు. ఆ తర్వాత గడచిన ముప్పయి ఏళ్లలో ఈ రాష్ట్రాన్ని దేశం యావత్తూ హైదరాబాద్ ‘విండో’ లోనుంచే చూసింది తప్ప, అంతకు మించి అది తన చూపు పరిధిని కోస్తాంధ్ర వరకు సారించింది లేదు. ఇటువంటప్పుడు ఇంకా కొత్తగా ఇక్కడ చూడడానికి ఏముందని? ఎందుకు ఇప్పుడు ఆంధ్రుల చరిత్ర ‘సిలబస్’ గురించిన ప్రస్తావన?

ఇంకా దేశమంతా ‘హేపీ న్యూ ఇయర్’ చెప్పుకుంటూ ఉండగానే, జనవరి రెండవ వారంలో తెలుగు వారి పెద్ద పండక్కి ముందు – జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జాతీయ ‘వార్త’ అయ్యారు ! (మిగతా ముగ్గురు జడ్జీలతో కలిసి సంయుక్తంగా మొదటిసారి పత్రికాగోష్టి నిర్వహించి సంచలనం సృష్టించారు!) అవును ఆయన ఆ నలుగురిలో మొదటివాడు. ఎవరీయన? ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు, అంటే హైదరాబాదా కాదే, మరెవరు? తెలంగాణా నుంచి విడిపోయిన ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా జిల్లా వాసి. ఎక్కడ -మొవ్వ మండలం. అదెక్కడా – క్షేత్రయ్య పదాలు రాసిన చోటు, సిద్దేంద్ర యోగి ద్వారా కూచిపూడి నృత్యం ఆవిర్భవించిన స్థలం, వాటికీ సమీప గ్రామం – చినముక్తేవి ఆయన పుట్టిన ఊరు. మరి మిగిలిన వారు?

జస్టిస్ చలమేశ్వర్ ది దేశానికి దక్షణంలో ఆగ్నేయమైతే, జస్టిస్ కురియన్ జోసఫ్ పశ్చామాన నైరుతిలో – కేరళ వారు, జస్టిస్ మదన్ లోకూర్ ఉత్తరంలో దేశ వాయవ్యాన – డిల్లీ వాసి, ఇక జస్టిస్ రంజన్ గోగోయ్ తూర్పున ఈశాన్య రాష్ట్రమైన – అస్సాం వాసి. అయితే ఈ దేశపు ఒక చారిత్రిక సంధి కాలంలో ఈ నాలుగు దిక్కుల్ని ఒక్కటి చేసినవాడు – జస్టిస్ చలమేశ్వర్. జననం 1953, తల్లి అన్నపూర్ణమ్మ – తండ్రి లక్ష్మీనారాయణ. చలమేశ్వర్ తండ్రి వకీలుగా పనిచేసిన బందరులో 1841 నాటికి; అంటే చలమేశ్వర్ జన్మించడానికి 112 ఏళ్ల ముందే డచ్చి దొర రాబర్ట్ టర్లింగ్టన్ నోబుల్ ప్రారంభించిన స్కూల్ వుంది.

స్థానిక బ్రాహ్మణులకు మాత్రమే ఆ పాఠశాలలోకి ప్రవేశం వుండేది. కొన్నాళ్ళకు వారి స్త్రీలకు బోర్డింగ్ స్కూల్ వసతి కూడా వుండేది. స్కూల్ లోకి శూద్ర కులాలకు అడ్మిషన్లు ఇవ్వడానికి అనుమతి కొరకు అప్పట్లో నోబుల్ దొర మెడ్రాస్ ప్రెసిడెన్సీకి సుదీర్గ కాలం పాటు ఉత్తరాలు రాయాల్సి వచ్చింది. ఒక ప్రాంతం బాహ్యప్రపంచానికి ‘ఓపెన్’ కావడం అనేది ఎలావుంటుంది అని చెప్పడంకోసం ఇప్పుడీ ప్రస్తావన!

ఒక జీవ నదిని అనుకుని, ఒక పోర్ట్ పట్టణం పక్కన వున్న ఊళ్ళు – వందల ఏళ్ళు గడిచాక, కడకు ఏమవుతాయి? సామాజిక కుదుపు గురించి, ఆంధ్రప్రదేశ్ తెలుగు సమాజం గురించి, దేశం మాట్లాడుకోవడానికి, ఈ దేశం గురించి ప్రపంచ దేశాలు మాట్లాడుకోవడానికి (అదీ ఒక ‘పాజిటివ్ టోన్’ తో) – ఇంతకు మించిన సందర్భం మళ్ళీ సమీప భవిష్యత్తులో మనకు దొరక్క పోవచ్చు.

ఒక త్రిపురనేని గోపీచంద్, ఒక వడ్డెర చండీ దాస్ (అస్సలు పేరు చెరుకూరి సుబ్రమణ్యేశ్వర రావు) ఇదే ప్రాంతం నుంచి ఇదే సామాజిక నేపధ్యం నుంచి వచ్చాక; ఆ తదుపరి దశలో కాలం చెక్కే వ్యక్తులు ఎలావుంటారో చెప్పడానికి – ఇంకా మనకు ఎటువంటి ఉపోద్గాతం కావాలి?

అయినా ఈ సందర్భంగా మనం తప్పనిసరిగా అడగవలసింది మాత్రం ఒకటుంది. మన యూనివర్సిటీల చరిత్ర పాఠ్యపుస్తకాల రచనకు ‘టైం ఫ్రేం’ విధిగా మరి కొంత కాలం పొడిగించాలని. మరొక కొత్త అధ్యాయం అదనంగా దానికి జోడించాలని!

(ఇది… జనవరి 2018 నాటి రచన ఆంధ్రప్రదేశ్ అంశాలు చర్చించడానికి డిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రితో పాటుగా 23.9.2020 నాడు అధికారుల బృందంలో జస్టిస్ చలమేశ్వర్ కుమారుడు సుప్రీంకోర్టు న్యాయవాది జాస్తి భూషణ్ కూడా ఉన్నారన్న వార్త చదివి…)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *