ఎమ్మెల్యేలే ఫైనల్… కార్పోరేషన్ల భర్తీపై జగన్ క్లారిటీ

Share this Page

ఏపీలో కార్పోరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్ల పోస్టుల భర్తీ పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ నేతలకు కీలక ఆదేశాలిచ్చారు. కొద్ది రోజులుగా అధికార పార్టీలో వీటి భర్తీ పైన కసరత్తు జరుగుతోంది. అయితే, కొందరు ఎమ్మెల్యేలు తామ ప్రతిపాదించన పేర్లను పరిగణలోకి తీసుకోవటం లేదని… తమ సూచనలను పట్టించుకోవాలని సీఎంను కోరారు. మొత్తం వ్యవహారంపై క్లారిటీ ఇవ్వాలంటూ కీలక నేతలను సీఎం ఆదేశించారు. అదే సమయంలో విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణారావు, ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సీఎం జగన్మోహన్‌రెడ్డి సమీక్షలో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కార్పొరేషన్లవారీగా చైర్మన్లు, డైరెక్టర్ల పోస్టులకు మూడేసి పేర్ల చొప్పున ఉంచిన ప్రతిపాదనలపై జగన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 52 కార్పొరేషన్లు, మరో 4 నామినేటెడ్‌ పోస్టుల విషయమై జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్‌ పదవుల విషయంలో జిల్లాను యూనిట్‌గా ఎందుకు తీసుకోలేదని…. మహిళలకు 50 శాతం పదవులివ్వాలన్న ఎందుకు విస్మరించారని నేతలను ప్రశ్నించారు. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలని.. సోమవారం మళ్లీ సమావేశమవ్వాలని చెప్పారు. అదే రోజు జాబితాకు తుది రూపు వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *