తెలంగాణ శాసనసభలో వాడీవేడి చర్చ

తెలంగాణ శాసనసభలో వాడీవేడి చర్చ
హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. రైతు సమస్యలపై చర్చ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. వచ్చే ఏడాది వర్షాకాలం నుంచి ప్రతి రైతుకు ఎకరానికి రూ.4వేలు చొప్పున ఇవ్వనున్నట్టు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. భూ రికార్డుల ప్రక్షాళన లెక్కన రైతుకు రూ.4వేలు చొప్పున పెట్టుబడి వ్యయం ఇస్తామన్నారు. రైతు రుణమాఫీ, కనీస మద్దతు ధరపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రాష్ట్ర ఆవిర్భావం జరిగే వరకు వ్యవసాయ సంక్షోభానికి కారణం ఎవరు? రైతులను ఆదుకొనేందుకు అన్ని విధాలా కృషిచేస్తున్నదెవరు? అని కాంగ్రెస్‌ నేతలను ప్రశ్నించారు. రైతులకు కావాల్సింది రెండు పంటలకు సాగునీరు, విద్యుత్‌, విత్తనాలు, వ్యయం తగ్గించడం, మద్దతు ధరలేనన్నారు. ఇవన్నీ సమకూరిస్తే రైతులు అప్పుల బారి నుంచి బయటపడతారన్నారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్నారు.

విద్యుత్‌ సంక్షోభాన్ని ఆరు నెలల్లో నివారించి కొరత లేకుండా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తానూ నిజాం సాగర్‌ ఆయకట్టు రైతునేనన్నారు. కోటి ఎకరాలకు నీరిచ్చి రైతుల పాదాలు కడగాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో రైతులకు రెండు పంటలకు నీరిచ్చి తీరుతామని స్పష్టం చేశారు.

భూ ప్రక్షాళన కార్యక్రమం చరిత్రాత్మకమైనదని, ఆ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు మంత్రి చెప్పారు. వ్యవసాయ శాఖలో 1520 ఉద్యోగాల భర్తీ చేపట్టామని, 5వేల ఎకరాలకు ఒక వ్యవసాయాధికారిని నియమిస్తున్నట్టు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో రూ.16,124.45 కోట్ల రుణాలను మాఫీ చేయడం ద్వారా 35.30లక్షల మంది రైతులకు రుణవిముక్తి కల్గిందన్నారు. పాత, కొత్త తేడా లేకుండా అన్ని బ్యాంకుల్లో తీసుకున్న రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేసినట్టు మంత్రి తెలిపారు. రైతులకు ప్రకటించిన రుణమాఫీకి వడ్డీని సైతం ప్రభుత్వం ఇస్తామని ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌ సభ్యులు నిలదీశారు. దీంతో సభలో కాస్త గందరగోళ పరిస్థితి తలెత్తింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *