నిధులొచ్చాయ్‌.. కరిగి‘పోతున్నాయ్‌’

నిధులొచ్చాయ్‌.. కరిగి‘పోతున్నాయ్‌’
రూ. కోటి వచ్చినా నేటికీ ఏర్పాటవని కీటకాల ఏరివేత విభాగం
రసాయనాల కొనుగోలు, పరికరాల నిర్వహణ పేరిట దుర్వినియోగం
ఈనాడు – అనంతపురం
నంతపురం జిల్లాలో వేరుశెనగ పంటను నాశనం చేసే కీటకాల ఏరివేత రసాయనాల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా మంజూరైన నిధులు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. దీని అవసరాన్ని గుర్తించిన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూ.కోటి నిధులను మంజూరు చేసింది. వాటితో కొన్ని పరికరాలు కొనుగోలు చేశారు. ఈలోగా ప్యాకింగ్‌ కూడా తీయని ఆ పరికరాల నిర్వహణ (సర్వీసింగ్‌) పేరిట వచ్చిన నిధులు కొంత మేర ఖర్చు చేశారు. దాదాపు ఆరు లక్షలతో రసాయనాలను కొనుగోలు చేశామంటున్నారు. తద్వారా అక్రమాలకు తెరలేపారు. అప్పట్లో పనిచేసిన ఒకరిద్దరు శాస్త్రవేత్తలపై ఆరోపణలు వినవస్తున్నాయి. ప్రాథమికంగా రూ.లక్షల్లో నిధులు కరిగిపోయాయని చెబుతున్నారు. నేటికీ ఈ విభాగం ఏర్పాటవలేదు. ఈ జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో సగటున 15 లక్షల ఎకరాలకుపైగా వేరుశెనగ సాగు చేస్తుంటారు. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఒక్కోసారి ఒకే నెలలో అధిక వర్షాలు కారణంగా వివిధ రకాల పరుగులు, కీటకాలు పంటపై దాడిచేసి నాశనం చేస్తుంటాయి. ఇక్కడ రేకులకుంటలోని పరిశోధన కేంద్రం ఆధ్వర్యంలో ఈ కీటకాల సమస్య ఉన్న పొలాల్లో ప్రత్యేకమైన లింగాకర్షక ఎరగా పనిచేసే రసాయనం (పెర్మోన్‌ లూర్‌) పూసిన చిన్నపాటి బుట్టలు వంటివి కర్రకు పైన కట్టి ఏర్పాటు చేస్తారు. ఆ ఎర నుంచి ఆడ కీటకంలాటివాసన వస్తుంది. మగ కీటకాలన్నీ ఆ బుట్టలోకి వచ్చి చేరిపోతాయి. ఇక మగ, ఆడ కీటకాలు కలిసేందుకు అవకాశం లేక, ఆ కీటకాల సంఖ్య పెరిగేందుకు అవకాశం లేకుండా నియంత్రించినట్లు అవుతుంది. ఇందులో లింగాకర్షక ఎరగా ఉపయోగించే రసాయనాన్ని హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐఐసీటీ) నుంచి తెచ్చుకునేవారు. దీనిని దృష్టిలో పెట్టుకుని స్థానికంగానే ఈ రసాయనాల తయారీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి 2014-15లో నిధులిచ్చినా అది ప్రారంభం కాలేదు. ఈలోగా వివిధ పద్దుల కింద లక్షలాది రూపాయలను డ్రా చేశారు. ఇది వాస్తవమేనని కొందరు శాస్త్రవేత్తలు కూడా పరోక్షంగా అంగీకరిస్తున్నారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నాటికి ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తామని కీలక శాస్త్రవేత్త ఒకరు ‘ఈనాడు’కు స్పష్టం చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *