కాకినాడలో ఎల్‌ఎన్జీ టెర్మినల్‌

కాకినాడలో ఎల్‌ఎన్జీ టెర్మినల్‌
రూ.8వేల కోట్ల పెట్టుబడి
ముందుకొచ్చిన ఆస్ట్రేలియా సంస్థ ‘ఉడ్‌సైడ్‌’
చంద్రబాబుతో సంస్థ ప్రతినిధుల భేటీ
5 ప్రాజెక్టులకు ఏఐఐబీ వూతం
ఈనాడు – అమరావతి
పెట్రోలియం రంగంలో ఆస్ట్రేలియాలో ప్రసిద్ధి చెందిన ‘ఉడ్‌సైడ్‌’ పెట్రోలియం సంస్థ కాకినాడ వద్ద ఒక భారీ ఎల్‌ఎన్జీ (లిక్విఫైడ్‌ నేచురల్‌ గ్యాస్‌) టెర్మినల్‌ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ తన ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మంగళవారం సచివాలయంలో భేటీ అయింది. రాష్ట్రంలో పెట్టుబడులకు పెట్టడానికి తమకున్న ఆసక్తిని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి సీఈఓ జాస్తి కృష్ణ కిశోర్‌ వారిని ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. చమురు సహజవాయువు రంగంలో దాదాపు 60ఏళ్ల అనుభవం ఉన్న ఈ సంస్థ రాష్ట్రంలో రూ.8 వేల కోట్ల పెట్టుబడి పెట్టి భారీ ఎల్‌ఎన్జీ టెర్మినల్‌ ఏర్పాటు చేయడానికి ఆసక్తిగా ఉందని, 1200 మందికి ప్రత్యక్షంగా, రెండు వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించనుందని కృష్ణ కిశోర్‌ వివరించారు. ఉడ్‌సైడ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రెయిన్‌హర్డ్‌ మ్యాటిసన్‌, సాంకేతిక విభాగాధిపతి మూర్తి ఎర్రంకిలను చంద్రబాబు అభినందించారు. మూర్తి ఎర్రంకి గోదావరి ప్రాంతానికి చెందిన వారని తెలుసుకుని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కావాల్సిన సహకారం అందిస్తామన్నారు.

5 కీలక ప్రాజెక్టులకు ఏఐఐబీ వూతం
రాష్ట్రంలో చేపట్టిన ఐదు ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించడానికి ఏషియన్‌ ఇన్‌ఫ్రా అండ్‌ ఇన్వెస్ట్‌మెంటు బ్యాంకు (ఏఐఐబీ) ముందుకొచ్చింది. కేంద్రం సూచనల మేరకు ఆంధ్రప్రదేశ్‌కు రెండు బిలియన్‌ డాలర్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ఆ బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆ బ్యాంకు ఉపాధ్యక్షుడు డాక్టర్‌ డీజే పాండియన్‌ నేతృత్వంలో అధికారుల బృందం సీఎంతో సమావేశమై చర్చించింది. రోడ్లు భవనాల శాఖకు సంబంధించి రెండు ప్రాజెక్టులు, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా విభాగం, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్‌ శాఖలకు సంబంధించి మూడు ప్రాజెక్టులకు ఏఐఐబీ నిధులు అందిస్తోంది. వీటికి ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై అధ్యయనం చేయడానికి ఈ బృందం రాష్ట్రానికి వచ్చింది. మంత్రులు నారా లోకేష్‌, పి.నారాయణ తదితరులు పాల్గొన్నారు.

పేదలందరికీ ఆవాసం
ఇప్పటికీ సొంతింటికి నోచుకోని గ్రామీణ పేదల కోసం సర్వే నిర్వహిస్తే ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. మంగళవారం ఆయన సచివాలయంలోని తన కార్యాలయంలో గ్రామీణ గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. నిర్దేశించిన గడువులోగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు మరింత ఉత్సాహంగా పని చేయాలన్నారు. సొంతంగా స్థలం ఉండీ… ఆర్థిక ఇబ్బందులతో ఇళ్లు నిర్మించుకోలేని పేదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం అందిస్తున్నాయన్నారు. ఇలాంటి ఇళ్లకు ప్లాన్ల నుంచి కూడా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు మినహాయింపు ఇచ్చేలా ఆదేశాలిస్తామని ప్రకటించారు. చిత్తూరు జిల్లా పరార్లపల్లెలో బహుళ అంతస్థుల్లో 2 వేల ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు తయారు చేయాలని సూచనలు చేశారు. మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా ఈ ప్రాజెక్టు ఉండాలన్నారు. ఈ సమీక్షలో గ్రామీణ గృహనిర్మాణశాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ఛైర్మన్‌ వర్ల రామయ్య, మేనేజింగ్‌ డైరక్టర్‌ కాంతీలాల్‌ దండే తదితరులు పాల్గొన్నారు.

అంతర్‌రాష్ట్రమండలి స్థాయీసంఘం
సభ్యుడిగా చంద్రబాబు
ఈనాడు, దిల్లీ: కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అధ్యక్షతన ఏర్పాటైన అంతర్‌రాష్ట్ర మండలి స్థాయీ సంఘం సభ్యుడిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నియమితులయ్యారు. మిగతా సభ్యుల్లో కేంద్ర మంత్రులు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీ, నితిన్‌గడ్కరీ, తావర్‌చంద్‌గెహ్లోత్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గడ్‌, త్రిపుర, ఒడిశా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఉన్నారు. గత ఏడాది ఏర్పాటైన దీని పదవీకాలం ముగియడంతో పునరుద్ధరిస్తూ హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *