ఇందిరకు ప్రధాని సహా ప్రముఖుల నివాళులు

ఇందిరకు ప్రధాని సహా ప్రముఖుల నివాళులు
దిల్లీ: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా పలువురు జాతీయ ప్రముఖులు మంగళవారం నివాళులర్పించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్‌లో నివాళులు తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీలు ఇందిర స్మారక ప్రాంతమైన శక్తిస్థల్‌ వద్ద పూలతో నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్‌, రాహుల్‌లు 1 అక్బర్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ మోమోరియల్‌ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘‘ఇందిరా గాంధీ తన చివరిశ్వాస దాకా దేశానికి సేవలందించిన సమర్ధులైన, దూరదృష్టి కలిగిన నేత..’’ అని ప్రణబ్‌ ట్విట్టర్‌లో కొనియాడారు. ‘‘క్షమాగుణం ధైర్యవంతుల లక్షణం : ఇందిరా గాంధీ’’ అని రాహుల్‌ తన నాయనమ్మ ఫొటోతో సహా ట్వీట్‌ చేశారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో సోనియా గాంధీ ఏ కార్యక్రమాలకు హాజరు కాలేదు.

టీఎం కృష్ణకు జాతీయ సమగ్రత అవార్డు
భారత నైతిక విలువలుగా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విశ్వసించిన స్వేచ్ఛ, సహనం నేడు తిరస్కరణకు గురవుతున్నాయని కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత అవార్డును కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణకు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌లు కలిపి అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సోనియాగాంధీ ప్రసంగాన్ని రాహుల్‌ చదివి వినిపించారు. సంకుచిత జాతీయతావాదం పేరిట దేశం విడిపోతున్న తరుణంలో.. ఆ విలువలకు కట్టుబడిన వారికి గుర్తింపుగా ఇందిరాగాంధీ జాతీయ సమగ్రత అవార్డును అందజేస్తున్నట్లు సోనియా ప్రసంగంలో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *