గుజరాత్‌ నుంచి పాక్‌కు ఉగ్రనిధులు..?

గుజరాత్‌ నుంచి పాక్‌కు ఉగ్రనిధులు..?
ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల గుజరాత్‌లో ఇద్దరు ఐసిస్‌ ఉగ్రవాదులను అరెస్టు చేశాక కళ్లుచెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. గుజరాత్‌ నుంచి పాకిస్థాన్‌లోని అతిపెద్ద కమర్షియల్‌ బ్యాంక్‌ హబీబ్‌ బ్యాంక్‌( హెచ్‌బీఎల్‌)కు భారీగా నిధులు బదిలీ అయినట్లు ఉగ్రవాద వ్యతిరేక దళం(ఏటీఎస్‌) కనుగొంది. ఉగ్రకార్యకలాపాల కోసమే అని ఏటీఎస్‌ అనుమానిస్తోంది.

మరో 15 మందికి కూడా ఉగ్ర కార్యకలాపాలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తోంది. వీరిపై నిఘా వేసినట్లు అధికారులు వెల్లడించారు. వీరంతా దక్షిణ, మధ్య గుజరాత్‌లలోని గోధార, బరూచ్‌, వడోదర, సూరత్‌ ప్రాంతాలకు చెందినవారని పేర్కొంది. నిధుల బదిలీ వ్యవహారంలో వీరి పాత్ర కూడా ఉందని ఏటీఎస్‌ పేర్కొంది. బదిలీ అయిన నిధులు హెచ్‌బీఎల్‌ ఎక్కడికి చేరాయో మాత్రం వెల్లడించలేదు.

ఎన్‌ఐఏ చేతిలోకి ఉగ్రకేసు..
ప్రస్తుత కేసు ఎన్‌ఐఏకు బదిలీ కావచ్చని అధికారులు తెలిపారు. నిధుల వ్యవహారాన్ని ఎన్‌ఐఏ ప్రత్యేక కేసుగా భావించిన దర్యాప్తు చేసే అవకాశాలున్నాయన్నారు. ఇటీవల పట్టుపడిన ఉగ్రవాదుల్లో ఉబిద్‌ మీర్జా న్యాయవాది కాగా.. ఖాసీం ల్యాబ్‌ టెక్నిషియన్‌గా పనిచేస్తున్నారు. ఖాసీంతో కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌కు సంబంధాలు ఉన్నాయని గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ ఆరోపించిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *