నా అపార్ట్‌మెంట్‌ వద్దే దాడి జరిగింది

నా అపార్ట్‌మెంట్‌ వద్దే దాడి జరిగింది
న్యూయార్క్‌ దాడిపై ప్రియాంక చోప్రా
న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌లో డబ్ల్యూటీసీ వద్ద ఓ దుండగుడు ట్రక్కుతో ఉగ్రదాడికి పాల్పడ్డాడు. ఈఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. అయితే గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రదేశంలోనే ఈ ఘటన జరిగినట్లు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘నేనుంటున్న అపార్ట్‌మెంట్‌కి ఐదు బ్లాక్‌ల దూరంలో ఈ దాడి జరిగింది.పని పూర్తిచేసుకుని తిరిగి ఇంటికి వచ్చేసరికి సైరన్ల మోతతో హడలిపోయాను. ఆ చప్పుడు ప్రస్తుతం ప్రపంచమున్న పరిస్థితిని తెలియజేస్తోంది’ అని ప్రియాంక ట్వీట్‌లో పేర్కొన్నారు.

చిన్నారులను చంపాలనుకున్నాడు
ఉగ్రదాడికి కారకుడైన నిందితుడు సైఫుల్లా సైపోవ్‌ ట్రక్కుతో సైకిల్‌పై వెళ్తున్న వారిని ఢీకొనడమే కాకుండా ట్రక్కు నుంచి దిగి గన్ను పట్టుకుని అక్కడే ఉన్న చిన్నారులపై పరిగెత్తుతూ వెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నిందితుడిని ఉజ్బెకిస్థాన్‌కు చెందినవాడిగా న్యూయార్క్‌ పోలీసులు గుర్తించారు.

ఇతను ట్రక్కుతో దాడికి పాల్పడుతున్నప్పుడే ‘అల్లాహు అక్బర్‌’ అని కేకలు వేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు.

దుండగుడి వద్ద బొమ్మ తుపాకులు
నిందితుడి వద్ద బొమ్మ తుపాకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలి నుంచి పెయింట్‌బాల్‌ గన్ను, పెల్లెట్‌గన్ను స్వాధీనం చేసుకున్నారు. దాడి జరిపిన తర్వాత 20 సెకన్ల పాటు నిందితుడు ఘటనాస్థలిలోనే ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *