కొట్టాలి ఇప్పుడైనా

కొట్టాలి ఇప్పుడైనా
నేడే కివీస్‌తో భారత్‌ తొలి టీ20
నెహ్రా మీదే అందరి దృష్టి
సాయంత్రం 6.50 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌-1లో
దిల్లీ
వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ నుంచి అనూహ్యమైన పోటీ! అయితేనేం ఆఖరికి టీమ్‌ఇండియాదే సిరీస్‌ విజయం.. ఇప్పుడు కోహ్లిసేనకు మరో సవాల్‌.. ఈసారి టీ20ల రూపంలో! ఇంకేం ఈ ఫార్మాట్లో చితక్కొట్టేస్తారు.. అనుకోవడానికి లేదు! ఎందుకంటే ఇప్పటివరకు వారితో 5 టీ20 మ్యాచ్‌లు ఆడి ఒక్క దాంట్లో కూడా గెలవలేదు భారత్‌. మరి ఈసారైనా కివీస్‌ను ఓడిస్తారా? మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారమే తొలి పోరు. ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతున్న వెటరన్‌ పేసర్‌ నెహ్రాపైనే అందరి దృష్టి.

త్కంఠభరితంగా సాగిన వన్డే సిరీస్‌ ముగిసింది. ఇక ధనాధన్‌ టీ20 మ్యాచ్‌లు షురూ. జోరు మీదున్న కోహ్లి సేన మరో సిరీస్‌ విజయమే లక్ష్యంగా బరిలో దిగుతోంది. నేడు ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో కివీస్‌తో సమరానికి సిద్ధమైంది. వీడ్కోలు మ్యాచ్‌ ఆడుతున్న 38 ఏళ్ల పేసర్‌ ఆశిష్‌ నెహ్రాకు ఇదే ఆఖరి మ్యాచ్‌. అతని సొంతగడ్డ (దిల్లీ)పై జరిగే పోరు కావడంతో అభిమానుల చూపు అతనిపైనే ఉంది. ఈ మ్యాచ్‌లో నెహ్రా రాణించి జట్టును గెలిపిస్తే అంతకంటే గొప్ప వీడ్కోలు ఉండబోదు.

ఒక్కటీ గెలవలేదు: టీ20ల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు ఏమంత గొప్ప రికార్డు లేదు. వారితో ఐదు మ్యాచ్‌ల్లో తలపడిన టీమ్‌ఇండియా అన్నింట్లోనూ ఓడింది. ఆఖరిగా 2016 ప్రపంచ టీ20 ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ వారితో ఆడి పరాజయం పాలైంది. సొంతగడ్డపై ఈసారైనా కివీస్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని భారత్‌ భావిస్తోంది. వన్డే సిరీస్‌లో టీమ్‌ఇండియాకు గట్టిపోటీ ఇచ్చిన న్యూజిలాండ్‌.. టీ20ల్లో మరింత ప్రమాదకర జట్టు. ఆల్‌రౌండర్లతో కళకళలాడుతున్న కివీస్‌ను ఓడించడం కూడా కోహ్లి సేనకు అంత సులభం కాదు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన టామ్‌ లేథమ్‌తో పాటు రాస్‌ టేలర్లతో పాటు కెప్టెన్‌ విలియమ్సన్‌తో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ పటిష్టంగా ఉంది. ఇక బౌల్టú, సౌథీతో పాటు స్పిన్నర్‌ శాంట్నర్‌తో కూడిన వారి బౌలింగ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. ఈ జట్టులో టాడ్‌ అస్టిల్‌, టామ్‌ బ్రూస్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ లాంటి టీ20 స్పెషలిస్టులు ఉన్నారు.

అతను ఆడితేనే..: ప్రత్యర్థి ఎవరైనా కోహ్లి ఆడితేనే భారత్‌ విజయం తేలిక అవుతుంది. వన్డే సిరీస్‌లో రెండు సెంచరీలతో సత్తా చాటిన కోహ్లి.. టీ20ల్లో రాణించాలని జట్టు కోరుకుంటోంది. రోహిత్‌ కూడా సూపర్‌ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో భువనేశ్వర్‌, బుమ్రా.. అటు ఓపెనింగ్‌, ఇటు డెత్‌ బౌలింగ్‌లో అదరగొడుతున్నారు. వారిదే జోరు కొనసాగిస్తే కివీస్‌కు కష్టాలు తప్పవు. కాన్పూర్‌ వన్డేలో సత్తా చాటిన స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ విశ్వాసంతో కనిపిస్తున్నాడు. అతనితో పాటు చైనామన్‌ బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ తుది జట్టు చోటు సంపాదించే అవకాశాలున్నాయి.

జట్లు (అంచనా) : భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), ధావన్‌, రోహిత్‌ (వైస్‌ కెప్టెన్‌), కార్తీక్‌, మనీష్‌ పాండే, ధోని, హర్దిక్‌ పాండ్య, అక్షర్‌ పటేల్‌, భువనేశ్వర్‌, బుమ్రా, నెహ్రా, చాహల్‌

న్యూజిలాండ్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్తిల్‌, మున్రో, టేలర్‌, లేథమ్‌, నికోల్స్‌, గ్రాండ్‌హోమ్‌, శాంట్నర్‌, బౌల్ట్‌, సౌథీ, ఇష్‌ సోథీ

 

పిచ్‌, వాతావరణం
ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు చేసిన సగటు స్కోరు 146. ఐతే ఈ ఏడాది ఐపీఎల్‌లో 184 పరుగులు కూడా నమోదయ్యాయి. వైవిధ్యంగా బౌలింగ్‌ చేసే పేసర్లకు, స్పిన్నర్లకు పిచ్‌ నుంచి సహకారం లభిస్తుంది. వర్షం కురిసే సూచనలు చాలా తక్కువ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *