‘యుద్ధం’లోకి వార్నర్‌ సతీమణి!

‘యుద్ధం’లోకి వార్నర్‌ సతీమణి!
మెల్‌బోర్న్‌: యాషెస్‌ సిరీస్‌ అంటేనే యుద్ధం! క్రికెటర్లే కాదు వారి భార్యలు సైతం బరిలోకి దిగుతారేమో! ఇప్పటికే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇంగ్లాండ్‌పై మాటల సమరం ఆరంభించారు. ఆసీస్‌ వైస్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సిరీస్‌ను యుద్ధంతో పోల్చాడు. ప్రత్యర్థి క్రికెటర్లపై ద్వేషం పెంచుకొని మరింత ప్రేరణ పొందుతానన్నాడు. అంతకు ముందు సిరీస్‌లో వారి కన్నుల్లో భయం కనిపించిందని పేర్కొన్నాడు.

తాజాగా డేవిడ్‌ వార్నర్‌ సతీమణి క్యాండిస్‌ సైతం మాటల యుద్ధంలోకి దిగింది. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ప్రవర్తనతో జుగుప్స కలుగుతోందని మీడియాకు తెలిపింది. ‘ఆస్ట్రేలియా క్రికెటర్లు అత్యుత్తమ జట్టుతో తలపడాలని కోరుకుంటారు. అందుకే వారు బెన్‌స్టోక్స్‌ ఇక్కడికి రావడాన్ని ఇష్టపడతారు. స్టోక్స్‌ ఇక్కడికొస్తాడో రాడో నాకు తెలీదు. ఆయన వీడియో ఫుటేజీ మాత్రం చాలా అసహ్యం కలిగిస్తోంది. ఘోరంగా ఉంది’ అని క్యాండిస్‌ మీడియాతో పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌లో ఓ బార్‌ వద్ద జరిగిన గొడవలో స్టోక్స్‌ను పోలీసులు విచారించారు. ఇది క్రీడా ప్రపంచంలో దుమారం రేపింది. దీంతో తాత్కాలికంగా స్టోక్స్‌ను జట్టు నుంచి తప్పించారు. ఆ గొడవలో తమను రక్షించిన స్టోక్స్‌ హీరో అని ఓ గే జంట మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *