లక్ష్మణ్‌..నీ పరుగుల రహస్యం చెప్పనా!

లక్ష్మణ్‌..నీ పరుగుల రహస్యం చెప్పనా!
హైదరాబాద్‌: భారత మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఈ రోజు 43వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు మాజీ, ప్రస్తుత క్రికెటర్లు, అభిమానులు పెద్ద సంఖ్యలో సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. లక్ష్మణ్‌ ప్రస్తుతం భారత జట్టు ఆడే మ్యాచ్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. లక్ష్మణ్‌ను ముద్దుగా మణికట్టు మాంత్రికుడు అని పిలిచేవాళ్లు. ఎప్పుడూ తనదైన శైలిలో విషెస్‌ చెప్పే సెహ్వాగ్‌ ఇక్కడ కూడా తన మార్కును చూపించాడు. లక్ష్మణ్‌ చేతులను ‘రాయ్‌’ సినిమాలోని ‘చిటియాన్‌ కలైయాన్‌’ పాటతో పోల్చాడు.

‘రిస్ట్‌ జాదుగర్‌, భారత శ్రీ లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎలాంటి సందర్భాన్ని అయినా సరే తన మణికట్టు మాయతో అనుగుణంగా మార్చేస్తాడు. చిటియాన్‌ కలైయాన్‌’– వీరేంద్ర సెహ్వాగ్‌

‘హ్యాపీ బర్త్‌డే లక్ష్! మైదానంలో నువ్వు పరుగులు సాధించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో బయటికి చెప్పేయనా?. బ్యాటింగ్‌కు వెళ్లేముందు నువ్వు స్నానం చేసి యాపిల్‌ తింటావు. వూప్స్‌.’– సచిన్‌ తెందుల్కర్‌

‘హ్యాపీ బర్త్‌డే లక్ష్మణ్‌. నువ్వు సాధించిన 281 పరుగులు ఇండియన్‌ క్రికెట్‌కు వెరీ వెరీ స్పెషల్‌’– సురేశ్‌ రైనా

‘లచ్చి భాయ్‌ నువ్వు మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’– రవిచంద్రన్‌ అశ్విన్‌

‘ఎంతో వినయం, దయ కలిగిన వెరీ వెరీ స్పెషల్‌ లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.’– హర్భజన్‌ సింగ్‌

‘భారత క్రికెట్లో దిగ్గజమైన వీవీఎస్‌ లక్ష్మణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు.’– శిఖర్‌ ధావన్‌

‘ట్రూ మ్యాచ్‌ విన్నరైన లక్ష్మణ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.’– బీసీసీఐ

‘హ్యాపీ బర్త్‌డే లక్ష్మణ్‌’– ఐసీసీ

1996లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన లక్ష్మణ్‌ అనతి కాలంలోనే ఎంతో పేరు సంపాదించాడు. దీంతో వీవీఎస్‌ను కాస్త వెరీ వెరీ స్పెషల్‌గా మార్చుకున్నాడు. కంగారూల జట్టుపై లక్ష్మణ్‌దే పైచేయి. అంతర్జాతీయ క్రికెట్లో 11వేలకు పైగా పరుగులు సాధించిన లక్ష్మణ్‌ అందులో 3,173 పరుగులు ఆస్ట్రేలియాపైనే సాధించాడు. ఇందులో రెండు ద్విశతకాలు కూడా ఉన్నాయి. 2012లో ఆడిలైట్‌లో జరిగిన టెస్టు అనంతరం క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *