మనదే అత్యంత చెత్త సచివాలయం: కేసీఆర్‌

మనదే అత్యంత చెత్త సచివాలయం: కేసీఆర్‌
హైదరాబాద్‌ : తెలంగాణలో కొత్త సచివాలయంనిర్మాణంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ మండిపడ్డారు. ఈ అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడారు. కొత్త సచివాలయం నిర్మించగానే నగరం కాంక్రీట్‌ జంగిల్‌ అయిపోతుందని సభ్యులు మాట్లాడటం తగదన్నారు. మన సచివాలయం బాగోలేదని.. దేశంలోనే అత్యంత చెత్త సచివాలయం మనదని అన్నారు. ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ భవనాలు కట్టేశారని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా ఇంత అడ్డదిడ్డమైన సచివాలయం లేదన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లే దారే గందరగోళంగా ఉంటుందన్నారు. ప్రధాన విభాగాలు విసిరేసినట్లు ఉన్నాయని పేర్కొన్నారు. సచివాలయంలో ఒక్క బిల్డింగ్‌ కూడా నియమనిబంధనల ప్రకారం నిర్మించలేదని తెలిపారు. నగరంలో క్రీడామైదానాలకు కొదవలేదని.. 19 పెద్ద, ఇతర మైదానాలు ఉన్నాయని తెలిపారు. బైసన్‌పోల్‌ మైదానం క్రీడలకు ఉద్దేశించింది కాదని.. మిలటరీ వాళ్లదని స్పష్టం చేశారు.

ఇక మన శాసన సభలో పార్కింగ్‌ సౌకర్యాలే లేవని కేసీఆర్‌ అన్నారు. శాసన సభ నుంచి మండలికి వెళ్లాలంటే.. సరైన దారి లేదన్నారు. దేశంలోనే అద్భుతమైన, చారిత్రకమైన సచివాలయం, శాసనసభ, మండలి, పోలీసు హెడ్‌క్వార్టర్స్‌ భవనాలు మన తెలంగాణలో నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *