ఇదే ఆఖరిపోరాటం

ఇదే ఆఖరిపోరాటం
తుది ఉద్యమంతోనే సామాజిక తెలంగాణ
2019లో కాంగ్రెస్‌ అధికారంలోకి తెస్తాం
రేవంత్‌రెడ్డి వెల్లడి..
పలువురు నేతలతో కలిసి రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
మామూలు పార్టీ మార్పిడిగా చూడవద్దని వ్యాఖ్య
కేసీఆర్‌ను చోటా మోదీ అన్న రాహుల్‌
ఈనాడు, దిల్లీ: తెలంగాణ పోరాట యోధులు, అమరవీరుల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషిచేస్తామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డిలు తెలిపారు. తెలంగాణ వచ్చాక ఏ వర్గానికి న్యాయం జరగలేదని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబపాలనకు వ్యతిరేకంగా అందరూ పునరేకీకరణ కావాలని వారు అన్నారు. మంగళవారమిక్కడ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో 40 మందికి పైగా తెదేపా, తెరాస నేతలు, ఓయూ విద్యార్థినేతలతో కలిసి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్‌లో చేరడాన్ని మామూలు పార్టీ మార్పుగా చూడవద్దు. 1969 ఉద్యమంలో 369 మంది అమరులయ్యారు. 2009 మలి ఉద్యమంలో 1200 మంది అమరులయ్యారు. అమరవీరుల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చినా 40 నెలల కేసీఆర్‌ పాలనలో అది నెరవేరలేదు. నీళ్లు, నిధులు నియామకాలు కోసం పోరాటం చేస్తే వాటిని పక్కనపెట్టారు. వారంతా గొర్రెలు, బర్రెలు, చీరల కోసం ఆత్మహత్యలు చేసుకోలేదు. సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యుల విలాస జీవితానికి లక్ష కోట్ల బడ్జెట్‌ను ఉపయోగించుకుంటున్నారు. వాస్తు పిచ్చిని తెలంగాణ ప్రజలపై రుద్దుతున్నారు. తొలి, మలి ఉద్యమంలో రాష్ట్రం వచ్చింది. సామాజిక తెలంగాణగా పరిణతి చెందలేదు. అది రావాలంటే తుదిఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్‌ వ్యతిరేక పునరేకీకరణ అవసరం. అందుకే ఇష్టమైన తెదేపాను వీడి కాంగ్రెస్‌లోకి వచ్చా. ఇకపై తెలంగాణలో మరో ఉద్యమం అవసరం లేకుండా కేసీఆర్‌, ఆయన కుటుంబ పీడను విరగడ చేయడానికే కాంగ్రెస్‌లో చేరాం. ఇదే ఆఖరిపోరాటం కావాలి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌తోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరతాయి.

రాహుల్‌ది కుటుంబ పాలన కాదు
కుటుంబ ప్రయోజనాల కోసం పాలన సాగిస్తున్నారు కాబట్టే తెలంగాణలో కుటుంబపాలన అన్నాం. రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి, మంత్రి పదవులు వదులుకుని సీనియర్లకు గౌరవం ఇచ్చారు. దీన్ని కుటుంబపాలన అనడానికి వీల్లేదు. కాంగ్రెస్‌లో కార్యకర్తగా చేరా. కేసీఆర్‌ కుటుంబ కట్టుబానిసలు మాట్లాడితే నేను స్పందించను’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

వేదికపై పేరు చెప్పలేదని అలక
పార్టీలో చేరిన వారి పేర్లు ఏఐసీసీ మీడియా సమావేశంలో ప్రకటించినప్పుడు తమ పేర్లు చదవలేదని కొంతమంది నేతలు అలకబూనారు. దీంతో రేవంత్‌రెడ్డి తర్వాత మీడియా సమావేశంలో వారి పేర్లు వెల్లడించారు.

కాంగ్రెసే ప్రత్యామ్నాయం: కుంతియా
కేసీఆర్‌, ఆయన కుటుంబం కోసమే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని కుంతియా విమర్శించారు. అందుకే కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ పార్టీగా భావించి అందరూ చేరుతున్నారని కుంతియా పేర్కొన్నారు. పార్టీలో చేరిన నేతలకు రాహుల్‌గాంధీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒక్కొక్కరినీ పేరుపేరునా రాహుల్‌కు పరిచయం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ను చోటామోదీగా రాహుల్‌ అభివర్ణించారని ఉత్తమ్‌ మీడియాకు తెలిపారు.

తెలంగాణ ఫలాలు ప్రజలకు అందిద్దాం: రాహుల్‌: ఏ ఫలాలు ఆశించి తెలంగాణలో ఉద్యమాలు చేశారో అవి ప్రజలకు అందేలా చేద్దామని పార్టీలో నూతనంగా చేరిన నేతలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. తెలంగాణ ఫలాలు ప్రజలకు అందకుండా కొందరే అనుభవిస్తున్నారని పరోక్షంగా సీఎం కేసీఆర్‌పై రాహుల్‌ వ్యాఖ్యలు చేశారని సమాచారం.


కాంగ్రెస్‌లో చేరిన నేతలు వీరే

మాజీమంత్రి బోడ జనార్ధన్‌, మాజీ ఎమ్మెల్యేలు విజయరమణారావు, వేం నరేందర్‌రెడ్డి కె.గంగాధర్‌, సీతక్క సోయం బాపూరావు, గంగాధర్‌గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ అరికల నర్సారెడ్డి, గండు సావిత్రమ్మ, తెదేపా అధికార ప్రతినిధి సతీశ్‌ మాదిగ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, హరిప్రియానాయక్‌, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, తోటకూర జంగయ్యయాదవ్‌, బిల్యానాయక్‌, రాజారాంయాదవ్‌, పటేల్‌ రమేశ్‌రెడ్డి, తోటకూర రవిశంకర్‌, దొమ్మాటి సాంబయ్య, మన్నె సతీశ్‌, మేడిపల్లి సత్యం, కె.భూపాల్‌రెడ్డి, రావి శ్రీనివాసరావు, భట్టి జగపతి, ఎం.కశ్యప్‌పెడ్డి, మదెదల రవీందర్‌, సుభాష్‌రెడ్డి, శశికళాయాదవ్‌రెడ్డి, చుక్కాల ఉదయ్‌చందర్‌, డగిల శ్రీకాంత్‌గౌడ్‌, చారకొండ వెంకటేశ్‌, పొట్టి ఎల్లయ్యయాదవ్‌, కొప్పుల నరిసింహారెడ్డి, జి.రఘుకిరణ్‌, సాతు మల్లయ్య, హరిసింగ్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వరరావు, బి.జ్ఞానేశ్వర్‌, దొమ్మాటి సాంబయ్య, శివరాజ్‌పాటిల్‌, సిహెచ్‌.సత్యనారాయణరెడ్డి, మారెపల్లి సురేందర్‌రెడ్డి, మంగి జైపాల్‌రెడ్డి (తెరాస), ఆర్‌.ఎస్‌.ఉదయసింహా, ఆలపాటి విజయ్‌బాబులు. విద్యార్థి నాయకులు దరువు ఎల్లన్న, బాలలక్ష్మి, దుర్గం భాస్కర్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *